కవిత్వమంటే పదాల్లో ఇమిడే బొమ్మలు(పద చిత్రాలు). చిత్ర లేఖనం అంటే గీతల్లో ఇమిడే పదాలు (భావాలు). పద చిత్రాలు, చిత్ర పదాలు ఒకే పుస్తకంలో ఉంటే ఎలా వుంటుంది? గీతలు, గీతాలు ఒకే కాగితం వేదిక మీద నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? ఈ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు, కాగితం మీద చదువుతాం. చదువుతున్నప్పుడు అదే కాగితం మీద చూస్తాం. ‘అనగనగా’ అనే టైటిల్ భలే నప్పింది. అమ్మ తన పాపకు చెబుతున్నట్టు లేదా వినిపిస్తున్నట్టు ఉన్న క(వి)తలివి. అమ్మ వినిపించే కవితలకు పాప వేసినట్టున్న బొమ్మలు. పుస్తకంలో బొమ్మలన్నీ, కవితలన్నీ ఆ మాటకు తగినట్టే ఉన్నాయి. అట్ట మీద బొమ్మను చూడాలి. పైనుంచి పడుతున్న పండును అందుకుంటున్న పక్షి, కిందికి పడిపోతున్న పండును పట్టుకుంటున్న పక్షి. రెండు పక్షులు వేర్వేరా? కాదేమో! రెండూ ఒకటే, లేదా వేర్వేరు కూడా. గతం, భవిష్యత్ కాలాల్లాగ. రెండూ కలిసి కాలమే కదా?! అవి నర్తించేది కూడా కాలం (వర్తమానం) మీదే. పుస్తకం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు... ఆ రెండు పనులూ ఆపేసి, ఒళ్లో పుస్తకంతో కవయిత్రి/గీతయిత్రి రెచ్చగొట్టిన మన ఊహల్లో మనం తేలుతున్నప్పుడు కలిగే ఆభిప్రాయాలివి. ఈ పుస్తకంలో సామాజిక స్పృహ ఎంత ఉందో కళా స్పృహ కూడా అంత ఉంది. మనస్సుకు, మస్తిష్కానికి ఒకే సారి మేత వేసే పుస్తకం. పాపలా ప్రశ్నలు వేసే పుస్తకం. అమ్మలా జవాబులిచ్చే పుస్తకం. అనగనగా ఒక భవిష్యత్తులోకి తీసుకెళ్లే మంచి పుస్తకం