సస్పెన్స్, ఉత్కంఠ, మానవ మనస్తత్వపు అంధకారపు పొరలు... ఇవన్నీ చెప్పగానే ఒక్క పేరే గుర్తుకొస్తుంది - ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. సినిమా ప్రపంచాన్ని ఊపేసిన ఆ ప్రభంజనం వెనుక, ఆయన పేరిట వెలువడిన ఒక మిస్టరీ మేగజైన్ కూడా ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. అదే Hitchcock Mystery Magazine. ఈ సంకలనంలోని కథలు అనేక అంతర్జాతీయ రచయితలవి. కాని ప్రతి దాంట్లోను హిచ్కాక్ శైలీ, సూక్ష్మమైన మెరుపు కనిపిస్తుంది. సస్పెన్స్ కి పాఠకుడిని లాక్కెళ్ళి, మానవ స్వభావపు లోతుల్లో ముంచెత్తే కథన కౌశలం. భయాన్ని, ఉత్కంఠను, అనూహ్య మలుపులను శిల్పమై మలిచే మాంత్రిక రచన. “హిచ్కాక్ మెచ్చిన కథలు - మళ్లీ చెప్పింది మృణాళిని" అనే పేరుతో వచ్చిన ఈ కథలు ఉదయం వారపత్రికలో ప్రచురితమైన రోజుల్లోనే పాఠకుల ఆదరణ పొందాయి. కాలగమనంలో పాత సంచికల్లో మిగిలిపోయిన ఈ కథలను ప్రత్యేకంగా శోధించి సేకరించి, ఈ పుస్తకరూపంలో పునర్జన్మ పొందేలా చేయడం రచయిత్రి ప్రతిభకు, అభిమాన పాఠకుల ఆసక్తికి నిలువెత్తు సాక్ష్యం. హిచ్కాక్ ఎన్నటికీ పాతబడడు ఈ కథలూ పాతబడవు. మిస్టరీని ప్రేమించే పాఠకులకు, ఉత్కంఠని ఆస్వాదించే వారికి ఈ పుస్తకం తప్పక చదవవలసిన అనుభవం.