ప్రశ్నించడం అనేది కేవలం మన హక్కు మాత్రమే కాదు, అది సమాజం బాగుపడటానికి చాలా అవసరం. కానీ, ఎవరైనా తప్పును ప్రశ్నిస్తే, వారికి ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మన చుట్టూ జరిగే తప్పులను చూసి కూడా, గొడవలు మనకెందుకులే అని మౌనంగా ఉంటే, దానిని ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు, ధైర్యం చేసి అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో “ప్రశ్నిస్తే ఏమవుతుంది?" నవల మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అన్యాయాన్ని ఎదిరించడం అనేది ఈనాటిది కాదు. ఆ మధ్య తరగతి యువకుడి తండ్రి బాల్య వివాహాలను ఆపడం దగ్గర నుండి, భార్య సుభద్ర కాలేజీల్లో జరిగే అన్యాయాలను నిలదీయడం వరకు... ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాడారని ఈ కథ గుర్తుచేస్తుంది. అయితే, ఒక చిన్న ట్రాఫిక్ సమస్యను ఎత్తిచూపినందుకు, ఈ వ్యవస్థ అతనిని ఎలా భయపెట్టింది, ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో ఇందులో చూడవచ్చు. ప్రశ్నిస్తే బెదిరింపులు వస్తాయి, కానీ ఆ భయంతో మనం ఆగిపోతే సమాజంలో తప్పులు పెరిగిపోతాయి. కష్టాలు వచ్చినా సరే భయం లేకుండా ప్రశ్నించడం చాలా ముఖ్యం అని ఈ నవల చాటిచెబుతుంది. అంతేకాదు, మహాభారతంలో అర్జునుడికి కృష్ణుడు తోడుగా నిలిచినట్లు, ధైర్యంగా ప్రశ్నించే వారికి మనం కూడా అండగా నిలబడాలని, వారిని కాపాడుకోవాలని ఈ కథ మనకు బలంగా చెబుతుంది.