1936లో తన ఈ తొలి కాల్పనిక నవలను అయిన్ రాండ్ వెలువరించారు. నవలలో ముఖ్య పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ మూడే మూడు పాత్రల చుట్టూ ఎక్కువగా సంఘర్షణాత్మక కథ నడుస్తుంది. దాదాపుగా పాత్రలన్నింటినీ మన కళ్లకు కట్టినట్టు చూపించినా, అయిన్ రాండ్ కేవలం మూడు పాత్రలను 'త్రీ డైమన్షనల్ గా చిత్రించడంతో ఈనాటికీ ఈ రచన ప్రజల మన్ననలను పొందుతోంది. లక్షలాది కాపీలుగా అమ్ముడుపోతోంది. ఆ మూడు పాత్రలూ - కిరా అర్థన్నోవా, లియో కొవలెన్ స్కీ, ఆండ్రే తగనోవ్. “నా ఆత్మకథ అనిపించేటంత సహజత్వంతో పుణికిపుచ్చుకున్న 'వుయ్ ద లివింగ్' కథావస్తువు కాల్పనిక రచనే! అయితే చారిత్రక నేపథ్యం మాత్రం కాల్పనికమైనది కాదు. కిరా జీవితంలో సంభవించిన సంఘటనలు నా జీవితంలోనివి ఎంతమాత్రం కావు. అలాగే ఆమె ఆలోచనాధోరణి కూడా నాది కాదు. నేరపూరితమైన బలహీనత, ఆమె ప్రదర్శించిన విలువలు కూడానూ.” అయిన్ రాండ్