అక్షరమను నర్తకికీ, కాగితమను వేదికకీ మక్కువ తీర్చకుండ మఱుగేల నటరాజా? సూర్యగోళపు జ్వాలవై, సిరివెన్నెల జోలవై, మా మెలకువ నీవై, నీ నెలకువ మా ఎదై... ఇన్నాళ్ళుగా ఉన్నాముగా ఇనయిలలంటి గురుశిష్యుల వోలె? పాంచజన్యములో పోసిన పంచామృతమె కద నీ వాక్యము ఆ తీర్థము త్రాగి పరవశించేరు ఎల్లరు జనులు! ఎల్లలను త్రెంచుతూ, వెల్లువై సాగుతూ, పల్లవించు నీ గానము అజ్ఞాన తిమిర సంహరణకై సుదర్శన శస్త్రమైన శాస్త్రము! నీ పదములను పొదువుకొని నిగమాలు పలికినవి సరిగమలై మా నిశ్శబ్దం ఉనికిని చాటుకుంది నీ కవనమే తన గాత్రమై జాతి వంటి మా గుండెల్ని ప్రేమతో చెక్కింది ఉలి నీ కలమై రసవాహిని కౌగలించింది ప్రతి మనసునీ నీ భావలహరై జాబిలిలో జొబ్బిలు ఏటిపై మెఱిసే తెర నీ కవిత వీచే తెమ్మెర తుమ్మెదై ఆలపించే పాట నీ కవిత పూచే వసంతాల పుప్పొడి ఆడే కేళి నీ కవిత మట్టిని చీల్చుకు పుట్టే పచ్చేని ప్రాణం నీ కవిత తత్త్వమే కవిత్వమై పూచేటి కొమ్మకి మూలమై నిలిచావు కనిపెంచిన తరువై నీ తనువున అణువణువున వెలసిన అనురాగమై పొందవా మఱుజన్మను పాటవై, పూబాలవై! పొందవా మఱుజన్మను పాటవై, పూబాలవై! మహాకవికి కావ్యాంజలి